Header Ads

'జాంబీ రెడ్డి' ట్రైలర్: ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళొస్తారు.. ఈసారి జాంబీలు వస్తున్నాయి..! | Zombie Reddy Trailer


'అ!' 'కల్కి' వంటి చిత్రాలతో విభిన్న చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం ''జాంబీ రెడ్డి''. భారతదేశపు తొలి జాంబి మూవీగా వస్తున్న ఈ చిత్రంతో బాలనటుడిగా పేరు తెచ్చుకున్న తేజ సజ్జ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఇందులో ఆనంది - దక్ష నగార్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టైటిల్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగించిన చిత్ర యూనిట్ సినిమాపై అంచనాలు పెంచేలా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అక్కినేని సమంత రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ మంచి స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈరోజు శనివారం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా 'జాంబీ రెడ్డి' బిగ్ బైట్ ట్రైలర్ విడుదల చేయబడింది.

ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది అని ప్రకటిస్తుండగా.. కరోనా బీర్ అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తానని పెద్దాయన చెప్తున్నాడని ఇద్దరు వ్యక్తులు మాట్లాడటంతో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ స్టోరీగా ఈ జాంబీ సినిమా రూపొందిందని తెలుస్తోంది. 'నువ్వింకా సమరసింహా రెడ్డి కాలంలో ఉన్నావ్.. ఇది అర్జున్ రెడ్డి టైం బ్రో' 'ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళొస్తారు.. ఈసారి జాంబీలు వస్తున్నాయి' వంటి డైలాగ్స్ అలరిస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యాన్ని తీసుకుని జాంబీల కాన్సెప్ట్ జోడించినట్లు తెలుస్తోంది. అయితే జాంబీల సినిమా అయినప్పటికీ భయం కలిగించే అంశాలతోపాటు వినోదం పంచే సన్నివేశాలు కూడా ఉన్నాయి. తేజ స్టైలిష్ గా కనిపిస్తూనే యాక్షన్ సీన్స్ లో కూడా మంచి నటనను కనబరిచి హీరో మెటీరియల్ అనిపించుకున్నాడు.

దీనికి మార్క్ కె రాబిన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదనపు ఆకర్షణగా నిలిచింది. చివర్లో 'కరోనా బ్యాడ్ అయితే వాళ్ళ డాడ్ ఎవరు' అని ప్రశ్నించారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీసే ప్రశాంత్ వర్మ ఈసారి జాంబీలతో సక్సెస్ అయ్యేలా ఉన్నాడు. ఇందులో రఘుబాబు - పృథ్వీరాజ్ - జబర్దస్త్ శ్రీను - హేమంత్ - హరితేజ - అన్నపూర్ణమ్మ - కిరీటి - రమరఘు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్స్ విల్లే స్క్రీన్ ప్లే అందించగా.. సాయిబాబు ఎడిటర్ గా వర్క్ చేశారు. ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ఈ 'జోంబీ రెడ్డి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

No comments

Powered by Blogger.