ధర్నా చేస్తామంటున్న షారూఖ్ ఫ్యాన్స్..అభిమానం బాస్..అభిమానం | Shahrukh Fans Fires on Him over Video
సినిమా హీరోల మీద అభిమానం పెంచుకుంటే.. ఆ ఫ్యాన్స్ ఎంతలా ఆరాధిస్తారో తెలియనిది కాదు. వారిని గుండెల్లో దాచుకొని కొలుస్తుంటారు. అలాంటిది ఆ హీరో సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా మిగిలిపోతుంటే..? ప్రతీ సినిమా నిరాశ పరుస్తుంటే.. వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ బాధ మరో అభిమానికి మాత్రమే తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఫ్యాన్స్.. తమ హీరో బ్లాక్ బస్టర్ హిట్ ఎప్పుడు కొడతాడా? అని ఎదురుచూస్తుంటారు. మరి ఈ టైంలో ఆ హీరో సినిమా చేయడమే ఆపేస్తే..? రెండేళ్లకు పైగా కొత్త సినిమా ప్రకటించకపోతే..? అభిమానులు ఎలా ఫీలవుతారు? ఇప్పుడు బాలీవుడ్ బాద్షా ఫ్యాన్స్ కూడా ఇలాగే ఉడికిపోతున్నారు.
షారుఖ్ ఖాన్ సినిమా విడుదలకాక ఇప్పటికి రెండేళ్లు దాటిపోయింది. అంతకు ముందు వచ్చిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. నిజం చెప్పాలంటే.. షారూఖ్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా జనాలకు గుర్తు లేదంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు.. బాలీవుడ్ను ఏలి బాలీవుడ్ బాద్షాగా జెండా ఎగరేశాడు షారూఖ్. కానీ.. కొన్నేళ్లుగా వరుస డిజాస్టర్లతో మీడియం రేంజ్ హీరోలకు కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితిల్ పడిపోయాడు షారూఖ్.
2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత షారూఖ్ ఇప్పటి వరకూ కెమెరా ముందుకు రాలేదు. కనీసం తన కొత్త సినిమా గురించి ఏ న్యూసూ రిలీజ్ కాలేదు. యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి పెద్ద బేనర్లో ‘పఠాన్’ అనే సినిమా చేస్తున్నట్లు కొన్ని నెలల ముందు వార్తలొచ్చాయి. ఈ సినిమా మొదలైనట్లు కూడా తెలుస్తోంది. కానీ ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటిదాకా విడుదల కాలేదు.
దీంతో ఫ్యాన్స్ కు మండిపోతోంది. ఇప్పటికే తమ హీరో సినిమాలు హిట్ కావట్లేదని ఏడుస్తుంటే.. ఇప్పుడు కనీసం తమకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదని ఫైర్ అవుతున్నారు. సినిమా ఓకే అయ్యాక షూటింగ్ కూడా మొదలుపెట్టాక.. ఈ విషయాన్ని ప్రకటిస్తే.. యూనిట్ సొమ్మేం పోతుందని అడుగుతున్నారు. ‘పఠాన్’ అనే పేరు ఖరారైనప్పుడు టైటిల్ లోగో విడుదల చేసి.. ఈ సినిమా మొదలైందని చెప్తే ఏంటన్నది వారి ప్రశ్న. ఈ విషయంలో యశ్రాజ్ ఫిలిమ్స్ తీరుతో విసుగెత్తిపోయిన షారుఖ్ ఫాన్స్.. రెండు రోజులుగా ‘పఠాన్’ సినిమా గురించి అనౌన్స్మెంట్ ఇవ్వాలంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
ఈ హ్యాష్ ట్యాగ్.. ఇండియా లెవెల్లో టాప్లో ట్రెండ్ అయింది. చివరకు అంతర్జాతీయ స్థాయిలోనూ దాన్ని ట్రెండ్ చేసే ప్రయత్నం చేశారు షారుఖ్ విదేశీ ఫ్యాన్స్! ఈ క్రమంలోనే ఓ హెచ్చరిక కూడా జారీచేశారు. ఒకట్రెండు రోజుల్లో ‘పఠాన్’ గురించి ప్రకటన రాకుంటే.. ముంబైలోని యశ్ రాజ్ ఫిలిమ్స్ ఆఫీస్ ముందు భారీ స్థాయిలో ధర్నా చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. మరి ఈ ట్రెండ్ చూశాక అయినా ‘పఠాన్’ గురించి యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రకటన చేస్తుందో లేదో చూడాలి.
Post a Comment