ఇక్కడ హీరో .. అక్కడ విలన్! | RX100 fame Kartikeya is also continuing to play negative roles
కార్తికేయ .. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో తొలి హిట్ అందుకున్నాడు. కుర్రాడు బాగున్నాడు .. యాక్షన్ - రొమాన్స్ తో కూడిన పాత్రలకి బాగా సెట్ అవుతాడని అంతా అనుకున్నారు. సన్నిహితులు కూడా అదేమాట చెప్పారేమో .. ఆయన కూడా అదే రూట్లో వెళుతున్నాడు. అయితే ఆ తరువాత ఆయన చేసిన సినిమాల్లోనూ యాక్షన్ ఉంది .. రొమాన్స్ ఉంది .. కానీ వాటిని బలంగా ప్రెజెంట్ చేసే సరైన కథే లేదు. అందువల్లనే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అప్పటి నుంచి ఆయన సరైన హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు.
కార్తికేయలో రఫ్ లుక్ ఉంది .. సిక్స్ ప్యాక్ బాడీ ఉంది .. ఆ రెండింటికీ తగిన హైట్ ఉంది. అందువలన విలన్ పాత్రలకి కూడా ఆయన బాగా సెట్ అవుతాడనే టాక్ వినిపించింది. అనుకున్నట్టుగానే 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమాలో విలన్ గా ఆయనకి అవకాశం వచ్చింది. ఆ సినిమాలో విలన్ గా ఆయన మెప్పించాడు. తెలుగు తెరకి ఓ యంగ్ విలన్ దొరికాడని అందరూ చెప్పుకునేలా చేశాడు. తెలుగులో ఆయన చేసిన ఆ విలన్ రోల్ తమిళంలోను ఆయనకి మరో విలన్ రోల్ తగిలేలా చేసింది.
తమిళంలో అజిత్ హీరోగా 'వలిమై' సినిమా రూపొందుతోంది. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అక్కడ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఆ పాత్ర కోసమే కార్తికేయను తీసుకున్నారు. ఈ పాత్రలో కార్తికేయ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడనీ - ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా హిట్ అయితే తమిళంలో విలన్ గా కార్తికేయ మరిన్ని సినిమాలు చేసే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే ఇక్కడ హీరోగా .. అక్కడ విలన్ గా కార్తికేయ బిజీ అవుతాడేమో చూడాలి. ఇక హీరోగా ఆయన చేసిన 'చావుకబురు చల్లగా' సినిమా త్వరలోనే థియేటర్స్ కి రానుంది.
Post a Comment