మదనపల్లి హత్యలు.. రూ.5 కోట్ల కోసమే చంపేశారా? | Madanapalle double murder case
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన హత్యల విచారణలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. మూఢనమ్మకాలతోనే ఈ దారుణాలు జరిగాయని చెబుతున్నప్పటికీ.. దీని వెనుక మరో కోణం ఉందా? అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది.
చిన్న కూతురు సాయిదివ్యలోని దుష్టశక్తిని చంపేస్తున్నానంటూ పెద్ద కూతురు అలేఖ్య కత్తితో నుదుటన గుచ్చి దివ్యను చంపేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే. ఆ తర్వాత తనను కూడా అలాగే చంపాలని అలేఖ్య చెప్పడంతో.. తల్లి పద్మజ అలేఖ్య నోట్లో కలశం గుచ్చి దారుణంగా హతమార్చిన విషయం కూడా తెలిసిందే.
ఆ తర్వాత పోలీసులు వీరిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నప్పటికీ.. పద్మజ ఏమాత్రం సహకరించడం లేదు. పురుషోత్తం నాయుడు పలు విషయాలు వెల్లడించినప్పటికీ.. ఆయన కూడా పూర్తిగా సాధారణ మనిషి కాలేదని సమాచారం. బుధవారం ఉదయం పద్మజ మానసికస్థితిని పరిశీలించిన జైలు సూపరింటెండెంట్ రామకృష్ణయాదవ్ జిల్లా వైద్యశాల మానసిక వైద్యనిపుణురాలు రాధికకు సమాచారం అందించారు. ఆమె జైలుకు వచ్చి పద్మజకు కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయగా ఏ మాత్రం సహకరించలేదు. ఆధ్యాత్మికత దైవచింతనతో కూడిన మాటలతో వైద్యురాలిని తికమక పెట్టారు.
పురుషోత్తమ నాయుడు కూడా అదే తరహాలో మాట్లాడడంతో వారిని ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. తిరుపతి రుయాస్పత్రికి పంపించాలని రాధిక జైలు అధికారులకు సూచించారు. లేకపోతే.. వారి మానసికస్థితి ముదిరి మరిన్ని దారుణాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. దీంతో ఆమె ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పించారు పోలీసులు. అయితే.. సాయంత్రం వరకు కోర్టు నుంచి అనుమతి రాలేదు. న్యాయస్థానం అనుమతిస్తే.. దంపతులను గురువారం ఆస్పత్రికి తరలిస్తామని జైలు సూపరింటెండెంట్ రామకృష్ణయాదవ్ చెప్పారు.
కాగా.. ఆర్థిక కోణంలోనూ ఈ హత్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పద్మజకు తన కుటుంబం నుంచి ఆస్తి వాటాగా.. రూ.5కోట్లు వచ్చాయట. ఈ నేపథ్యంలో ఆ డబ్బును కాజేసేందుకే పథకం పన్ని ఎవరైనా ఇలాంటి ఘాతుకానికి ఒడికట్టారా? అనే సందేహాలు వ్యక్తంచేస్తున్నారు స్థానికులు. పేరు చెప్పడానికి ఇష్టపడని స్థానికులు.. ఈ రకమైన అనుమానాన్ని బలంగా వ్యక్తం చేశారు. మరి ఏది నిజం..? మూఢ నమ్మకాలు బలిగొన్నాయా? ఆ పేరుతో ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అనే విషయాలు పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది.
Post a Comment