2021 అంతా దేవీ శ్రీ ప్రసాద్ హవానే | Devi sri busy with 2021
ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండే దేవి శ్రీ ప్రసాద్ 2020లో మాత్రం అంతగా సత్తా చూపించలేకపోయాడు. తన తోటి సంగీత దర్శకుడు తమన్ దూసుకుపోతుంటే ఈయన మాత్రం రేసులో వెనకబడిపోయాడు. 2020లో సరిలేరు నీకెవ్వరు మినహా దేవి ఖాతాలో చెప్పుకోవడానికి సినిమాలు కూడా లేవు. అదే సమయంలో తమన్ మాత్రం అల వైకుంఠపురంలో, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ లాంటి మ్యూజికల్ ఆల్బమ్స్ ఇచ్చాడు. అయితే గతేడాది ఎలా ఉన్నా కూడా కొత్త సంవత్సరంలో మాత్రం దేవి శ్రీ ప్రసాద్ దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ సంవత్సరం ఆయన చేతిలో అరడజను సినిమాలకు పైగానే ఉన్నాయి. పైగా ఉప్పెన పాట యూ ట్యూబ్ లో చరిత్ర సృష్టించింది. మరోవైపు నితిన్ రంగ్ దే పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
దాంతో ఇదే ఊపులో 2021ని షేక్ చేయాలని చూస్తున్నాడు రాక్ స్టార్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సంక్రాంతికి విడుదల అవుతుంది. అప్పటి నుంచే తన మాయ మొదలు పెడుతున్నాడు దేవి శ్రీ ప్రసాద్. గతంలో బెల్లంకొండ హీరోగా వచ్చిన అల్లుడు శీను, జయ జానకి నాయక సినిమాలకు సంగీతం అందించాడు దేవి. ఆ తర్వాత వరుసగా నితిన్ రంగ్ దే.. ఉప్పెన సినిమాలు రానున్నాయి. ఇక చాలా రోజుల తర్వాత రవితేజ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు ఈయన. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతున్న ఖిలాడీ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో అప్పట్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో రాబోయే సినిమాకు దేవి సంగీతం అందిస్తున్నాడు.
వీటితో పాటు కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి, అల్లు అర్జున్ పుష్ప.. అనిల్ రావిపూడి సెన్సేషన్ బ్లాక్ బస్టర్ ఎఫ్2 సీక్వెల్ ఎఫ్ 3 ప్రస్తుతం దేవి చేతిలో ఉన్న సినిమాలు. ఇవన్నీ 2021 లోనే విడుదల కానున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమాలతో మళ్లీ తానేంటో నిరూపించుకుంటానని సంగీత ప్రతిజ్ఞ చేస్తున్నాడు దేవి. ఇవి మాత్రమే కాదు మరికొన్ని సినిమాలు కూడా దేవి శ్రీ ప్రసాద్ ఖాతాలో ఉన్నాయి. గతేడాది పూర్తిగా తమన్ సత్తా చూపిస్తే ఈ సారి 2021 తాను దత్తత తీసుకుంటా అంటున్నాడు డి.ఎస్.పి.
Post a Comment