Header Ads

మా కూతుళ్లను చంపేశాం.. కానీ, బతికొస్తారు: పద్మజ వింత వాదన.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు | madanapalle parents killed two daughters court sentenced 14 days remand padmaja said that her daughters will come alive


చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఇద్దరు కూతుళ్లను తల్లిదండ్రులు అతి దారుణంగా హత్య చేసిన ఘటనకు సంబంధించిన కేసులో నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్యల కేసులో తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులుగా చేర్చిన తల్లిదండ్రులిద్దరినీ పోలీసులు మంగళవారం రెండో అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు వద్ద హాజరు పరిచారు. విచారణ అనంతరం నిందితులకు మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో వారిని సబ్‌ జైలుకు తరలించారు.
కాగా, ఈ నెల 24వ తేదీన పురుషోత్తం నాయుడు, ఆయన భార్య పద్మజ క్షుద్రపూజల పేరుతో తమ కన్న బిడ్డలు అలేఖ్య (27), సాయి దివ్య (21ను ఇంట్లో అత్యంత కిరాతకంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో పిల్లలిద్దరినీ తామే చంపినట్లు నిందితులు మంగళవారం పోలీసులు ఎదుట నేరం అంగీకరించారు.
అయితే బిడ్డలు తిరిగి బతికి వస్తారన్న ఆశతోనే ఇలా చేశామని మృతురాలి తల్లి పద్మజ పోలీసులకు వెల్లడించింది. ‘‘మా ఇంట్లో దేవుళ్లు ఉన్నారు. పూజలు చేస్తున్నాం. పూజల వల్లే మా చిన్న కూతురు ఆరోగ్యం కుదుటపడింది. గత పది రోజులుగా అన్నం తినకుండా పూజలు చేస్తున్నాం. మా బిడ్డలు చాలా తెలివైనవాళ్లు. కచ్చితంగా బతికొస్తారు. ప్రపంచంలో ఘోరాలు పెరిగిపోయాయి, అవి తగ్గటానికి పూజలు చేస్తున్నాం. ఇక కలియుగం అంతం అయిపోయింది, సత్య యుగం వచ్చేసింది’’ అని పద్మజ చెప్పుకొచ్చింది.

మరోవైపు నిందితుల మానసిక స్థితిపై పోలీసులు, వైద్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులను ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షించిన సైక్రియాట్రిస్ట్ రాధిక వారి మానసిక స్థితి సరిగా లేదని చెప్పారు. వారి ఆరోగ్య స్థితి మెరుగు పడాలంటే తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో వైద్యం ఇప్పించాలని సూచించారు. అయితే డీఎస్పీ రవి మనోహరాచారి మాత్రం నిందితుల మానసిక స్థితి బాగానే ఉందని పేర్కొన్నారు. తాము అడిగిన దానికి వారు స్పష్టంగా సమాధానం ఇచ్చారని, అయితే ఆధ్యాత్మికత చాలా ఎక్కువగా ఉందదని వివరించారు.

No comments

Powered by Blogger.