Header Ads

మదనపల్లి హత్యలు..రిమాండ్ రిపోర్టు ఇదే..ఒళ్లు గగుర్పొడిచే అంశాలు..! | Madanapalle double murder case

 Madanapalle double murder case

మదనపల్లెలో మూఢత్వంతో కూతుళ్లను హత్యచేసిన తల్లిదండ్రుల కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే.. నిందితులు పురుషోత్తం నాయుడు పద్మజను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్ రిపోర్టులో పలు ముఖ్యమైన అంశాలను పేర్కొన్నారు.

ఈ రిపోర్టులోని అంశాల ప్రకారం.. పెద్ద అమ్మాయి అలేఖ్య(27) సాయి దివ్య (22) ఒక రోజు పెంపుడు కుక్కను తీసుకొని ఉదయం బయటికి వెళ్లారు. ఈ క్రమంలో వారు.. నిమ్మకాయలు మిరపకాయలు ఉంచిన ముగ్గును తొక్కారు. అయితే.. వారు ఇంటికి వచ్చిన దగ్గరనుండి భయపడడం మొదలు పెట్టారు. చిన్న అమ్మాయి సాయి దివ్య తాను చనిపోతానేమోనని ఆందోళన వ్యక్తం చేయగా.. అక్క అలేఖ్య కూడా ఆ అనుమానాన్ని బలపరుస్తూ వచ్చింది.

దీంతో.. తల్లిదండ్రులు ఒక భూతవైద్యుడిని ఇంటికి పిలిపించి 23వ తేదీన తాయత్తులు కట్టించారు. కానీ.. సాయి దివ్య మాత్రం తాను చనిపోతాననే భయం నుండి బయటకు రాలేదు. తాను చనిపోతానంటూ సాయి దివ్య బిగ్గరగా ఏడుస్తుండడంతో తల్లిదండ్రులు వేపకొమ్మలతో కొట్టారు. ఆ క్రమంలో మరింత గట్టిగా ఏడవడంతో ఈసారి డంబెల్స్ తీసుకొని దయ్యాన్ని వదిలించాలని తలపై బలంగా మోదారు.

ఆ తరువాత సాయిదివ్య నుదిటిపై కత్తితో కోశారు. దీంతో.. తీవ్రంగా రక్తస్రావమైన సాయి దివ్య మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ప్రాణాలు విడిచింది. ఈ ఘటన జరిగిన తర్వాత చెల్లిని మళ్లీ ఈ లోకానికి తీసుకు వస్తానంటూ అలేఖ్య తల్లిదండ్రులకు చెప్పింది. అందుకోసం అలేఖ్య తన నోటిలో కలశం పెట్టి డంబెల్ తో తలపై కొట్టమని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో.. పురుషోత్తం నాయుడు పద్మజా కలిసి అలాగే నోట్లో కలశం పెట్టి డంబెల్ తో తలపై కొట్టారు. దీంతో.. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అలేఖ్య కూడా చనిపోయింది.

కూతుళ్లిద్దరూ చనిపోయిన తర్వాత పురుషోత్తం నాయుడు గౌరీ శంకర్ అనే విశ్రాంత అధ్యాపకుడితో ఫోన్లో మాట్లాడారు. ఆయన సూచన మేరకు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీడీగా ఉన్న రాజు అనే వ్యక్తి పురుషోత్తం నాయుడు ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో పూజ గదిలో బూడిద కత్తిరించిన జుట్టు గాజు ముక్కలు కనిపించాయి. రాత్రి 9:30 ప్రాంతంలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

కాగా.. నిందితులకు న్యాయస్థానం 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించింది. జైల్లో పద్మజ వింత ప్రవర్తనతో ప్రత్యేక గదిలో ఉంచారు. పురుషోత్తం నాయుడు మొదట్లో కాస్త బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఆయన కూడా విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించాలని వైద్యలు సూచించారు. ఇదే విషయాన్ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు నిర్ణయం మేరకు పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.

No comments

Powered by Blogger.