WDCW Jobs in AP: ఏపీలో 5905 అంగన్‌వాడీ పోస్టులు.. టెన్త్ విద్యార్హత
ప్రధానాంశాలు:
- అత్యధికంగా 4,007 హెల్పర్ల పోస్టులు
- మిగిలిన వాటిలో 430 మినీ అంగన్‌వాడీ వర్కర్లు
- 1,468 మెయిన్ అంగన్‌వాడీ వర్కర్ పోస్టులు
- రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో ఖాళీ పోస్టులకు జిల్లాల వారీగా ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేస్తోంది. 5,905 పోస్టుల భర్తీకి దశలవారీగా దరఖాస్తులను ఆహ్వానించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీల ద్వారా భర్తీ ప్రక్రియను చేపట్టారు.
ప్రధానంగా అంగన్‌వాడీలు, మినీ అంగన్‌వాడీల్లో వర్కర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ జరుగుతోంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్‌లలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పోస్టుల భర్తీకి పటిష్ట చర్యలు చేపట్టారు.
మొత్తం పోస్టుల్లో 4,007 అంగన్‌వాడీ హెల్పర్లు, 430 మినీ అంగన్‌వాడీ వర్కర్లు, 1,468 మెయిన్ అంగన్‌వాడీల్లో వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పోస్టులను భర్తీ చేయగా మరికొన్ని చోట్ల నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి.
అభ్యర్ధుల కనీస విద్యార్హతను 10వ తరగతిగా ప్రభుత్వం నిర్ణయించింది. మెయిన్ అంగన్‌వాడీల్లో వర్కర్లకు రూ.11,500, మినీ అంగన్‌వాడీల్లో వర్కర్లుకు రూ.7 వేల చొప్పున వేతనాన్ని చెల్లించనున్నారు. హెల్పర్లకు కూడా రూ.7 వేల చొప్పున వేతనాన్ని అందజేస్తారు.
Post a Comment