నెహ్రూ ఇచ్చిన పూల దండ…ఆమెకు పెళ్లికాకుండా చేసింది! #ఫోటో వెనుక స్టోరి
మన సమాజంలో ఎప్పటి నుంచో దురాచారాలను పాటిస్తున్నారు. మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తున్నారు. దీని వల్ల అమాయకులు బలవుతున్నారు. ప్రపంచం అన్ని రంగాల్లోనూ ముందుకు కొనసాగుతుంటే మన దేశంలో మాత్రం ఇంకా అనాగరికుల్లా కొందరు వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పబోయే అలాంటి సంఘటన మాత్రం ఇప్పుడు జరిగింది కాదు. ఎప్పుడో 1959లో జరిగింది. అప్పుడు ఆ గ్రామస్థులు చేసిన అనాగరిక చర్య వల్ల ఓ మహిళ తన జీవితాంతం బాధపడింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
1959లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పశ్చిమ బెంగాల్‌లో ఓ డ్యామ్‌ను ప్రారంభించేందుకు వెళ్లారు. అక్కడ ఆయన స్థానికంగా ఉన్న ఓ గ్రామానికి చెందిన బుధిని మాంఝీయన్ అనే ఓ కార్మికురాలితో కలిసి డ్యామ్‌ను ప్రారంభించారు. ఆమె చేత డ్యామ్ స్విచ్ నొక్కారు. అయితే అంతకు ముందు ఆమెకు ప్రధాని నెహ్రూ ఓ పూలమాలను అందజేశారు. ఆమె ఆ పూలమాలను అందుకోవడమే ఆమె చేసిన నేరమైంది.
ఆ గ్రామ వాసుల ఆచారం ప్రకారం ఎవరైనా వ్యక్తి ఒక స్త్రీకి పూలమాలను ఇస్తే ఆ వ్యక్తి ఆ మహిళను పెళ్లాడినట్లు లెక్క. అందుకని ఆ గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి ప్రధాని నెహ్రూను ఆమె భర్తగా తీర్మానించారు. అయితే నెహ్రూ ఆ గ్రామస్థుల కులానికి చెందిన వాడు కాకపోవడంతో ఆమె ఆ గ్రామ ఆచారాన్ని మంటగలిపిందని వారు భావిస్తూ ఆమె గ్రామ బహిష్కరణ శిక్ష వేశారు. దీంతో ఆమె ఆ గ్రామాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది.
అయితే తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆమె ఆ గ్రామ శివార్లలోనూ ఉండేందుకు ఇష్టపడలేదు. నిత్యం ఆమెను తప్పు చేసిన దానిగా చూశారు. దీంతో ఆమె ఆ ప్రాంతం వదిలి నగరానికి వెళ్లిపోయింది. అక్కడ కూడా ఆమె అపరాధ భావనతో జీవితాంతం గడిపింది. దీంతో ఆమె పెళ్లి చేసుకునేందుకు కూడా ఇష్టపడలేదు. భయపడింది. కానీ తాను సహజీవనం చేసిన వ్యక్తితో ముగ్గురు పిల్లల్ని కన్నది. ఆ తరువాత ఆమె ఎప్పుడు తన గ్రామానికి వెళ్లినా ఆమెను తప్పు చేసిన దానిలాగే ఆ గ్రామస్థులు చూశారు. అయినప్పటికీ ఆమె అలాగే జీవనం సాగిస్తోంది.
మన సమాజంలో పైన తెలిపిన లాంటి ఘటనలు ఏటా ఎన్నో జరిగాయి. ఇప్పటికీ అనేక చోట్ల ఇలాంటి దురాచారాలు, మూఢ నమ్మకాలను పాటించే వారు ఎంతో మంది ఉన్నారు. వాటి వల్ల ఎంతో మంది అమాయకులు తీవ్రమైన వివక్షకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా బలవుతున్నాయి. ఇప్పటికైనా సమాజంలో మార్పు రాకపోతే ఇలాంటివి ముందు ముందు కూడా జరుగుతాయి.
Post a Comment