Header Ads

ఐపీఎల్ 2020లో SRHకి మరో దెబ్బ.. టోర్నీ నుంచి భువీ ఔట్

 

Bhuvneshwar Kumar (Pic Credit: IPL/BCCI)
ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మరో గాయం దెబ్బ తగిలింది. టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆ జట్టు సీనియర్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా.. సీజన్ మొత్తానికీ దూరమవగా.. తాజాగా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా గాయంతో ఐపీఎల్ 2020కి దూరమైపోయాడు.
    చెన్నై సూపర్ కింగ్స్‌పై గత శుక్రవారం దుబాయ్ వేదికగా మ్యాచ్‌ ఆడిన భువనేశ్వర్ కుమార్ చివర్లో బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. మ్యాచ్‌లో కీలకమైన 19వ ఓవర్‌ తొలి బంతిని విసిరే క్రమంలో భువనేశ్వర్ పాదం అదుపు తప్పడంతో అతని కుడికాలి తుంటికి గాయమైంది. అయినప్పటికీ.. ఆ ఓవర్‌ని పూర్తి చేసేందుకు రెండు సార్లు రనప్ చేసుకుంటూ వచ్చిన భువీ.. బంతిని మాత్రం విసరలేకపోయాడు. దాంతో.. ఆఖరిగా ఫిజియో సూచన మేరకు మైదానం వీడాల్సి వచ్చింది.

    2019 వన్డే ప్రపంచకప్‌లోనూ భువనేశ్వర్ కుమార్‌ని ఈ తుంటి గాయం వేధించింది. గత ఏడాది చివర్లో ఫిట్‌నెస్ సాధించిన భువీ.. మళ్లీ గాయపడ్డాడు. కానీ.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కరోనా వైరస్ కారణంగా కొన్ని నెలలు బ్రేక్ లభించడంతో పూర్తి స్థాయిలో అతను ఫిట్‌నెస్ సాధించినట్లు కనిపించాడు. కానీ.. మళ్లీ ఆ గాయం అతడ్ని వెంటాడింది.

    ఐపీఎల్ 2020 సీజన్‌లో ఐదు మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. రెండింటిలో గెలుపొంది ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. తాజా సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లాడిన భువీ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ పొదుపుగా బౌలింగ్ చేయగల భువీ టీమ్‌కి దూరమవడం.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి పెద్ద లోటు.

    No comments

    Powered by Blogger.