Header Ads

బాలికపై అత్యాచారయత్నం, పెట్రోలు పోసి నిప్పు.. ఖమ్మంలో దారుణం


ఖమ్మం: చికిత్స పొందుతున్న మైనర్ బాలిక
డబిడ్డలపై జరుగుతున్న అకృత్యాలపై దేశం గగ్గోలు పెడుతుండగానే ఖమ్మం పట్టణంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల ఓ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాల పాలైన బాలిక ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ 70 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో పోరాడుతోంది. 10 రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం ఎవరికైనా చెబితే బాధిత బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులను చంపేస్తామని నిందితుడి కుటుంబం బెదిరింపులకు పాల్పడటమే అందుక్కారణం.
    బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని ముస్తాఫా నగర్‌లోని ఓ సంపన్న కుటుంబంలో బాలిక పనిచేస్తోంది. 13 ఏళ్ల ఆ మైనర్ బాలికపై ఇంటి యజమాని కుమారుడు కన్నేశాడు. పది రోజుల కిందట ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఆ బాలిక ప్రతిఘటించడంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

    వీడియో: చికిత్స పొందుతున్న బాధితురాలు..
    బాలిక ఒంటికి నిప్పు.. అత్యాచారానికి ప్రతిఘటించడంతో

    మంటల్లో కాలుతూ ఆర్తనాదాలు చేస్తూ బయటకు పరుగెత్తుకొచ్చిన బాధితురాలిని స్థానికులు హాస్పిటల్‌లో చేర్పించారు. ఖమ్మం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బాధిత బాలిక.. పట్టణంలోని సంపన్న కుటుంబంలో పనిచేస్తోంది. ప్రస్తుతం 70 శాతం కాలిన గాయాలతో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది.

    ఈ దురాగతానికి పాల్పడిన నిందితుడు బాలిక కుటుంబాన్ని తీవ్రంగా భయపెట్టినట్లు తెలుస్తోంది. జరిగిన దారుణం గురించి ఎవరికైనా చెబితే బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా చంపుతానని బెదిరించినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    No comments

    Powered by Blogger.