వైట్ హౌస్ ను విడిచే వేళలోనూ అదే టెంపరితనం | Trumps Leave White House For Last Time
టెంపరితనం.. దానికి తోడుగా మొండితనం.. అన్నింటికి మించి.. ఎవరేం అనుకున్నా ఫర్లేదు.. తాను అనుకున్నదే జరగాలని భావించే ట్రంప్.. అధ్యక్ష పదవీకాలం ముగిసిన వేళలోనూ తన తీరును మార్చుకోలేదు. అత్యంత వివాదాస్పద అధ్యక్షుడిగాఅమెరికా చరిత్రలో నిలిచిపోయే ట్రంప్.. అధ్యక్ష పదవిలో ఉన్న చివరి నిమిషం వరకూ బైడెన్ ను కొత్త అధ్యక్షుడిగా అంగీకరించేందుకు ససేమిరా అనటం గమనార్హం.
వందేళ్ల చరిత్రలో ఏ ఒక్క అధ్యక్షుడు కూడా.. కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు అయ్యింది లేదు. ఆ రికార్డును బ్రేక్ చేసిన ఆయన.. కొత్త అధ్యక్షుల వారి ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు. అంతేకాదు.. అధ్యక్షుడిగా జో బైడెన్ పేరును ప్రస్తావించకుండానే ఆయన వైట్ హౌస్ ను వీడివెళ్లారు. ఇక.. మాజీ అధ్యక్షుడిగా వైట్ హౌస్ ను విడిచి వెళ్లేందుకు నో అన్న ట్రంప్.. అధ్యక్షుడి హోదాలోనే నిష్క్రమించటం విశేషం.
దీంతో.. ఆయన ఎయిర్ ఫోర్సు వన్ విమానంలోనే వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడాకు బయలుదేరి వెళ్లారు. వైట్ హౌస్ ను వీడి వెళ్లే ముందు మాట్లాడిన ట్రంప్.. అమెరికాకు 45వ అధ్యక్షుడిగా పని చేయటం జీవితకాల గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘ఎప్పటికి మీ కోసం పోరాడుతూనే ఉంటా. ఎక్కడున్నా అంతా చూస్తూనే ఉంటా. వింటూనే ఉంటా. గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి పాలనను అందించానని చెప్పగలను. కొత్త ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు. కొత్త ప్రభుత్వం అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
సాధారణంగా కొత్త అధ్యక్షుల వారికి వైట్ హౌస్ కు స్వాగతం పలకటం.. వైట్ హౌస్ ను చూపించటం లాంటివి చేస్తారు. ఇవేమీ ట్రంప్ చేయలేదు. అయితే.. కొత్త అధ్యక్షుల వారి కోసం ఒక లేఖను ఉంచినట్లుగా చెబుతున్నారు. ఆ సమాచారం ఎంతవరకు నిజమన్న విషయం రానున్న రోజుల్లో తేలనుంది. ఏమైనా.. పదవీకాలం ముగిసిన సమయంలోనూ ఇంత మొండితనం.. అంతకు మించిన టెంపరితనం ట్రంప్ కు మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు.
Post a Comment