అప్పుడు ఐరన్ లెగ్.. ఇప్పుడు అదృష్ట దేవత! | Then the Iron Leg now the goddess of luck
సినిమా ఇండస్ట్రీలో ఉన్నన్ని నమ్మకాలు.. మరెక్కడా కనిపించవంటే అతిశయోక్తి కాదేమో! పలానా వారికి పేరు బలం లేదంటారు.. ఒకరిది ఐరన్ లెగ్ అనీ మరొకరది గోల్డెన్ హ్యాండ్ అనీ రకరకాల నమ్మకాలతో ముందుకు సాగుతుంటారు సినీ జనాలు. అయితే.. ఇవి కొందరికి మేలు చేయగా ఎక్కువ మందికి మాత్రం నష్టాన్నే కలిగిస్తాయి. ఒక్కసారి ‘ఐరన్ లెగ్’ అని ముద్ర పడితే అంతే.. దాదాపు కెరీర్ ముగిసిపోయినట్టే. అయితే.. ఆ ముద్రపడిన హీరోయిన్ శృతిహాసన్.. అందులో నుంచి బయటపడడమే కాకుండా.. గోల్డెన్ హ్యాండ్ గా పిలవబడుతుండడం విశేషం.
మొదట్లో తాను నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో.. శృతిది ఐరన్ లెగ్ అని ముద్రవేశారు. దీంతో.. ఆమెను తమ సినిమాల్లో తీసుకోవడానికి మేకర్స్ చాలా ఆలోచించేవారు. కానీ.. ఇప్పుడు ఆమెను అదృష్ట దేవతగా కీర్తిస్తుండడం విశేషం. వరుసగా ఫ్లాపులొస్తున్న హీరోలు ఎవరైనా శృతిహాసన్ ను తీసుకుంటే.. వాళ్లకు హిట్ గ్యారెంటీ అంటున్నారు. అనడమే కాదు.. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా చూపిస్తున్నారు.
అప్పటి వరకూ ఐరన్ లెగ్ అనిపించుకున్న శృతిహాసన్.. పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ తో అదృష్ట దేవతగా మారిపోయింది. గబ్బర్ సింగ్ చిత్రం నాటికి వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు పవన్. గబ్బర్ సింగ్ తో దాదాపు పదేళ్ల తర్వాత హిట్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్.
ఇక మహేష్ బాబు సంగతి చూస్తే.. 1-నేనొక్కడినే ఆగడు సినిమాలతో ప్రిన్స్ సక్సెస్ కు బ్రేక్ పడింది. వరుసగా రెండు ఫ్లాపులిచ్చిన మహేష్.. ఆ తర్వాత శ్రీమంతుడుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్ అని గమనించాలి.
ఇప్పుడు లేటెస్ట్ గా రవితేజ ట్రాక్ రికార్డు పరిశీలిస్తే.. మాస్ మహరాజ్ కూడా వరుస ఫెయిల్యూర్స్ లోనే ఉన్నాడు. టచ్ చేసి చూడు నేలటిక్కెట్ అమర్ అక్బర్ ఆంటోనీ డిస్కోరాజా అంటూ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన క్రాక్ సినిమాతో హిట్ కొట్టాడు. ఇందులో కూడా శృతిహాసనే హీరోయిన్ గా ఉంది.
మరి దీన్ని బట్టి సినీ జనాలు గుర్తించింది ప్రేక్షకులు గమనించాల్సింది ఏమంటే.. శృతిహాసన్ ఇప్పుడు ఐరన్ లెగ్ కాదు.. అదృష్ట దేవత అని. వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్లు ఇచ్చే గోల్డెన్ హ్యాండ్ గా శృతి మారిపోయిందంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
మరి ఈ లాజిక్ ప్రకారం పవన్ వకీల్ సాబ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సి ఉంది. అందులో కూడా శృతిహాసనే హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కూడా ఈ సినిమాకు ముందు ఫ్లాపులోనే ఉన్నాడు. మరి మరోసారి పవన్ పాలిటి అదృష్ట దేవతగా మారి ఈ సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తుందా? లేదా? అన్నది చూడాలి.
Post a Comment