సోదరుడిని చంపిన వ్యక్తికి ప్రేమ వల...ఊహించని రేంజ్ లో రివేంజ్ ప్లాన్! | Shocking incident in Maharashtra Mumbai
ప్రతీకారం .. సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఎవరైనా తమకి ఇష్టమైన వారిని చంపేస్తే వారిపై ప్రేమ కురిపిస్తునట్టు నటించి అవకాశం రాగానే వారిని మట్టుబెట్టడానికి ప్లాన్ వేస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో వారే చిక్కిపోయి ప్రాణాలు వదులుతుంటారు. ఈ సంఘటనలు అన్ని కూడా సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా అలాంటి ఘటనే నిజజీవితంతో చోటుచేసుకుంది. ఓ మహిళ తన సోదరుడిని చంపినవారిపై ప్రతీకారం తీర్చుకుంది. ఇందుకోసం తన సోదరుడిని చంపిన వ్యక్తికి వలపు వల విసిరింది.
ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే.. 2020 జూన్లో ముంబైలోని మలాడ్ ప్రాంతంలో పార్కింగ్ విషయంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో అల్తాఫ్ షేక్ అనే వ్యక్తిని మహ్మద్ సాధిక్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఈ హత్య తర్వాత సాధిక్ ఢిల్లీ పారిపోయాడు. ఈ ఘటనతో అల్తాఫ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అల్తాఫ్ మరణంతో అతని సోదరి యాస్మిన్ షాక్ లోకి వెళ్లిపోయింది. ఎలాగైనా తన సోదరుడిని హత్య చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ హత్య జరిగిన నెల రోజుల తర్వాత యాస్మిన్.. మల్వానీ ప్రాంతంలో అల్తాఫ్ ఫ్రెండ్ ను కలిసి సాధిక్ ను చంపేందుకు ప్లాన్ సిద్దం చేసింది.
మొదట సాధిక్ ను హాని ట్రాప్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం యాస్మిన్ ఫేక్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసింది. ఆ అకౌంట్ నుంచి సాధిక్ తో చాటింగ్ చేయడం ప్రారంభించింది. అయితే అది హాని ట్రాప్ అని తెలియని సాధిక్.. ప్రేమలో పడిపోయాడు. ఈ క్రమంలోనే సాధిక్ యాస్మిన్ ను కలిసేందుకు ముంబైకి వచ్చాడు. శనివారం సాధిక్కు కాల్ చేసిన యాస్మిన్ చోటా కశ్మీర్ ప్రాంతానికి రావాల్సిందిగా కోరింది. అయితే అక్కడికి యాస్మిన్ కు బదులు అల్తాఫ్ ఐదుగురు స్నేహితులు చేరుకున్నారు. వారు సాధిక్ రాక కోసం అంబులెన్స్ లో వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సాధిక్ యాస్మిన్ చెప్పిన ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. దీంతో అల్తాఫ్ స్నేహితులు సాధిక్ ను అంబులెన్స్ లో ఎక్కించి కిడ్నాప్ చేశారు. అనంతరం అతడిని వాసాయి నైగాన్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేయాలని అనుకున్నారు.
అయితే సాధిక్ ను బలవంతంగా అంబులెన్స్ లో ఎక్కించడం చూసిన చోట కశ్మీర్ ప్రాంతంలోని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన నార్త్ రీజియన్ పోలీసులు అంబులెన్స్ను ట్రెస్ చేసే పనిలో పడ్డారు. అయితే నిందితులు ఉన్న అంబులెన్స్ లో పెట్రోలు అయిపోవడంతో వారు మరో కారును అద్దెకు తీసుకున్నారు. ఆ కారులో వారు వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవే వైపు బయలుదేరారు. ఆ మార్గంలో పోలీసలు వారిని పట్టుకుని.. సాధిక్ ను రక్షించారు. ఆ కారులో యాస్మిన్ కూడా ఉన్నారు. హత్యాయత్నం కేసులో వీరిని.. అల్తాఫ్ హత్య కేసులో సాధిక్ ను పోలీసులు అరెస్టు చేశారు.
Post a Comment