ఆ కేసులోనే కళా వెంకట్రావు అరెస్టు.. బాబు ఏమన్నారంటే? | Kala Venkatrao was arrested in that case
ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు.. సీనియర్ నేత కళా వెంకట్రావును తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్ పై విడుదలయ్యారు. ఇంతకూ ఆయన్ను ఏ కేసులో పోలీసులు అరెస్టు చేశారన్నది ఆసక్తికరంగా మారింది. విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపై ఉన్న శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఉదంతం అనంతరం చోటు చేసుకున్న పరిణామాల సందర్భంగా కళా వెంకట్రావును అరెస్టు చేశారు.
రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఇష్యూలో.. అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వెళ్లటం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు వెళ్లటం.. ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న విపరీత ఘటనలు అప్పట్లో సంచలనంగా మారాయి. విజయసాయి రెడ్డి వాహనంపై టీడీపీ నేతలు.. కార్యకర్తలు దాడిగి దిగటం.. చెప్పులు..రాళ్లు విసరటం తెలిసిందే. ఈ ఉదంతంపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇందులో కళా వెంకట్రావు ప్రేరేపించటంతోనే తాము విజయసాయి రెడ్డి వాహనంపై దాడికి పాల్పడినట్లుగా నిందితులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బుధవారం రాత్రి రాజాంలోని కళా ఇంటికి వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చీపురుపల్లికి తరలించారు.అనంతరం ఆయనకు స్టేషన్ బెయిల్ లభించటంతో విడుదలయ్యారు. ఇదే కేసులో మరో ఎనిమిది మందిని నెల్లిమర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుల జాడ దొరకకున్నా.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై మాత్రం అరెస్టుల వరకు వెళ్లటం విశేషం.
ఇదిలా ఉండగా.. కళా వెంకట్రావు అరెస్టుపై టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఉన్మాదం పరాకాష్ఠకు చేరిందన్న ఆయన.. కళా వెంకట్రావు అక్రమ నిర్బంధం ఆటవిక చర్యగా ఆయన అభివర్ణించారు. కళా వెంకట్రావును అరెస్టు చేసిన సందర్భంలో ఆయన్ను ఎక్కడకు తీసుకెళుతున్నారన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపకపోవటంతో ఆయోమయ పరిస్థితి నెలకొంది. అరెస్టు సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పలువురు టీడీపీ నేతల్ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Post a Comment