Header Ads

బీజేపీలోకి జీవిత.. నో చెప్పిన బండి సంజయ్.. సెటైర్లే సెటైర్లు! Jeevitha Rajasekhar rejoined BJP

 Jeevitha Rajasekhar rejoined BJP

సినీ నటి జీవితా రాజశేఖర్ మరోసారి పార్టీ మారారు. ఈ విషయం తెలియగానే.. ఆమె ఇప్పటి వరకూ ఏ పార్టీలో ఉన్నారా? అని గుర్తు చేసుకుంటున్నారు జనం. 2019 ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో కొనసాగిన ఆమె.. తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరారు. సోమవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు.

తానే కప్పుకున్నారు..!
అయితే.. జీవిత పార్టీ మారడం ఒక చర్చకు దారితీస్తే.. ఆమెకు లభించిన ఆహ్వానం మరో చర్చకు వేదికైంది. జీవితకు వెల్కం చెప్పిన బండి సంజయ్.. ఆమెకు కాషాయ కండువా కప్పడానికి మాత్రం నిరాకరించారు. ఈ తీరుతో అందరికీ విషయం అర్థమైపోయింది. గతంలోనూ కొన్నాళ్లపాటు రాజశేఖర్ దంపతులు బీజేపీలో కొనసాగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పార్టీ మారారు. అన్ని పార్టీలనూ ఒక రౌండ్ వేసుకొని మళ్లీ బీజేపీ తలుపు తట్టారు. ఇలాంటి వారు పార్టీలో ఉంటారో లేదోనని సందేహించారో ఏమోకానీ.. సంజయ్ మాత్రం పార్టీ కండువా కప్పలేదు. దీంతో.. తనకు తానే కాషాయ కండువా కప్పుకున్నారు జీవిత! ఇక మరో విశేషం ఏమంటే.. ఎప్పుడూ తన భర్త రాజశేఖర్తో కలిసి జంటగా పార్టీలు మారే జీవిత.. ఈసారి ఒంటరిగానే వచ్చి బీజేపీలో చేరారు.

ఇక్కడ ఎందుకు..?
ఇప్పటి వరకూ ఏపీ రాజకీయాల్లోనే ఉన్నారు. వైసీపీలో ఉన్న జీవిత.. బీజేపీలో చేరాలనుకుంటే ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమక్షంలోనే పార్టీలో చేరవచ్చు.. కానీ అక్కడి నుంచి వచ్చి తెలంగాణ బీజేపీలో చేరడమేంటనే చర్చ మొదలైంది.

కారణం అదేనా..?
ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే.. తెలంగాణలో బీజేపీ గాలి మెరుగ్గా ఉంది. కాబట్టి.. తెలంగాణలో చేరితేనే భవిష్యత్ లో ఉపయోగం జరుగుతుందని భావించి ఇక్కడ పార్టీ సభ్యత్వం తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపడంతో.. రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో ఏదైనా ఎమ్మెల్యే సీటు అడిగితే సరిపోతుందని భావిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే.. కండువా కప్పేందుకే నిరాకరించిన వారు.. ఇక ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారా? అనేది అసలైన ప్రశ్న.

సోషల్ మీడియాలో సెటైర్లు..
జీవితా రాజశేఖర్ పార్టీ మారడంపై సోషల్ మీడియా వేదికగా సెటైర్ల వర్షం కురుస్తోంది. ఇంకా ఎన్ని సార్లు పార్టీలు మారుతారంటూ ఎగతాళి చేస్తున్నారు. 2008లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజశేఖర్ జీవితా దంపతులు. ఆ తర్వాత 2014లో బీజేపీలో చేరారు. ఆ పార్టీ అప్పటి జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కొంత కాలానికి బీజేపీని వదిలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఆ తర్వాత చంద్రబాబు దగ్గరికి వెళ్లి టీడీపీలో చేరారు. మళ్లీ కొంతకాలానికే వైసీపీలోకి రిటర్న్ అయ్యారు. తాజాగా.. మళ్లీ ఆ పార్టీని వదిలి బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా ఇన్నిసార్లు పార్టీ మారడంతో ఈ దంపతులపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దాదాపు అన్ని పార్టీలనూ చుట్టేసిన వీరికి ఇక మిగిలింది జనసేన మాత్రమేనని లేదంటే.. మరో కొత్త పార్టీ పుట్టుకు రావాలంటూ సెటైర్లు వేస్తున్నారు.

No comments

Powered by Blogger.