షాక్ షాక్: థియేటర్ల కోసం కొట్టుకునే రోజులొస్తున్నాయ్!
టాలీవుడ్ లో నిరంతరం ఓ విషయంలో ఘర్షణ వాతావరణం తప్పనిసరి. అదే ఆ నలుగురు గుప్పిట్లో ఉండే థియేటర్ల అంశం. థియేటర్లను గుప్పిట పట్టి వీళ్లు ఆడే ఆట వల్లనే తాము సర్వనాశనం అయ్యామని చెప్పుకునే ఒక సెక్షన్ నిర్మాతల నుంచి ఎప్పుడూ ఘర్షణ వాతావరణం ఉంటుంది. సరైన సినిమాలు తీయకే థియేటర్లు దొరకడం లేదని ఆ నలుగురు లేదా ఆ పదిమంది తిట్టి పోస్తుంటే.. ఆ సెక్షన్ మాత్రం థియేటర్లను గుప్పట పట్టి ఇండస్ట్రీలో కొత్త వాళ్లను అంతంత మాత్రంగా ఉండేవాళ్లను నలిపేస్తున్నారని గొడవకు దిగుతుంటారు. ఇక పండగలు పబ్బాల వేళ అయితే ఇది మరింతగా ముదిరిపాకన పడుతుంటుంది. ప్రతియేటా సంక్రాంతికి ఎవరో ఒకరు గొడవ పడుతూ మీడియా ముందు వీరంగమాడడం చూసేదే.
అదంతా సరే కానీ మళ్లీ ఆ సీన్ చూసేదెపుడు? అంటే ఇంకెంతో సమయం పట్టదని కాన్ఫిడెన్స్ వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు ఏకంగా 80-90 సినిమాలు ఆన్ సెట్స్ బిజీగా షూటింగులు జరుపుకుంటున్నాయి. ఇవన్నీ రిలీజ్ లకు సిద్ధమైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించనలవి కానిది. తిరిగి ఆ నలుగురు కాన్సెప్ట్ రైజ్ అవుతుంది. ఆ పదిమందిపై నిందలు తప్పవనేది ఓ అంచనా. పండగలు పబ్బాల వేళ గంపగుత్తగా రిలీజ్ లకు వస్తే.. థియేటర్ల గుత్తాధిపత్యం అంటూ వీరంగమాడే సన్నివేశం రిపీటవుతుందని ఓ అంచనా. నిర్మాతల గిల్డ్ పెద్దలు ఎంతగా షెడ్యూలింగ్ చేసినా ఈ గొడవలు రిపీటవుతుండడంతో దీనిపై ఆసక్తికర చర్చ మొదలైంది. మహమ్మారీ నియమాలు పాటిస్తూ షూటింగులు చేయడంలో స్పీడ్ పెంచడంతో లొకేషన్లు కళకళలాడుతున్నా మునుముందు సన్నివేశంపై ఇప్పుడే అంచనా వేసేస్తున్నారు మరి.
దాదాపు ఇప్పుడున్న అందరు హీరోలు మూడు.. నాలుగు చిత్రాలతో బిజీగా ఉన్నారు. పెద్దగా డిమాండ్ లేని హీరోలు కూడా ఒకటి లేదా రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోజూ షిఫ్టులలో పనిచేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టాలీవుడ్ లో ఒకేసారి 80 పైగా షూటింగులు సాగుతున్నాయి. వీటిలో ఫీచర్ ఫిల్మ్ లు.. ఒటిటి డిజిటల్ సిరీస్ లు ఉన్నాయి. సాంకేతిక నిపుణులు సహా అద్దె పరికరాలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. చిన్న సినిమాలు చిన్న క్రేన్ లేదా ట్రాలీ అద్దెకు కావాలంటే చాలా కష్టమవుతోందట. అవసరమైన అద్దె పరికరాలు రాలేదనే కారణంతో ఒక పెద్ద హీరో నటిస్తున్న సినిమా షూట్ ను ఒక రోజుకు వాయిదా వేశారంటే అర్థం చేసుకోవాలి. వచ్చే ఏడాదిలో విడుదలయ్యేవన్నీ గుంపుగా మీదపడితే మాత్రం రిలీజ్ తేదీలు థియేటర్ల వ్యవహారంలో వివాదాలు తప్పవన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక కోణంలో మంచి జరిగితే ఇంకో కోణంలో వివాదాలు వేడెక్కించే సన్నివేశం ఉందిట.
Post a Comment