RR vs MI మ్యాచ్‌లో ఒంటిచేత్తో పొలార్డ్ క్యాచ్.. మలుపు తిరిగిన మ్యాచ్
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి టీమ్ బ్యాటింగ్ ఎంచుకోగా.. సూర్యకుమార్ యాదవ్ (79 నాటౌట్: 47 బంతుల్లో 11x4, 2x6) హాఫ్ సెంచరీ బాదడంతో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (0), కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (6), సంజు శాంసన్ (0), మహిపాల్ లూమర్ (11) తక్కువ స్కోరుకే ఔటవడంతో ఒకానొక దశలో ఆ జట్టు 42/4తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. కానీ.. ఈ దశలో ఓపెనర్ జోస్ బట్లర్ (70: 44 బంతుల్లో 4x4, 5x6) విధ్వంసకరీతిలో చెలరేగిపోయాడు. మిడిల్ ఓవర్లలో ఓవర్‌కి ఒక సిక్సర్ చొప్పున అతను బాదుతూ రావడంతో.. పరుగులు, బంతుల మధ్య అంతరం క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. దాంతో.. ముంబయి శిబిరంలోనూ కంగారు మొదలైంది. ఎంతలా అంటే..? ఫస్ట్ 24 బంతుల్లో 24 పరుగులు చేసిన బట్లర్.. ఆ తర్వాత కేవలం 11 బంతుల్లోనే 31 పరుగులు చేసేశాడు.
మ్యాచ్ చేజారిపోతున్నట్లు కనిపించడంతో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ.. తెలివిగా బౌలింగ్ చేసే కీరన్ పొలార్డ్‌ని రంగంలోకి దింపగా.. అతనికీ 6, 4తో బట్లర్ స్వాగతం పలికాడు. అయితే ఎట్టకేలకి ఇన్నింగ్స్ 14 ఓవర్‌లో జోస్ బట్లర్ జోరుకి కళ్లెం పడింది. ఆ ఓవర్‌లో మూడో బంతిని లాంగాన్ దిశగా సిక్స్ కోసం జోస్ బట్లర్ ఫుల్ చేయగా.. బంతి బౌండరీ లైన్‌ని దాటేలా కనిపించింది. కానీ.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కీరన్ పొలార్డ్ ఆఖరి క్షణంలో గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో ఆ బంతిని క్యాచ్‌గా అందుకునేందుకు ప్రయత్నించాడు. అయితే.. బంతిపై అతనికి పట్టు చిక్కలేదు. దాంతో.. అతని చేతి నుంచి బౌన్స్ అయిన బంతి కిందపడిపోతుండగా.. చాకచక్యంగా మళ్లీ దాన్ని క్యాచ్‌గా పొలార్డ్ అందుకున్నాడు. దాంతో.. ముంబయి ఊపిరి పీల్చుకుంది. బట్లర్ ఔట్‌తో ఒత్తిడికి గురైన రాజస్థాన్ ఆఖరికి 18.1 ఓవర్లలోనే 136 పరుగులకి ఆలౌటైంది.
Post a Comment