RCB vs CSK: ధోనీ సేనతో ఆర్సీబీ పోరు.. కోహ్లి టీమ్‌లో కీలక మార్పు!
గత సీజన్లలో అద్భుతంగా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో తడబడుతోంది. ఇప్పటి వరకూ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండింట్లో మాత్రమే గెలిచిన ధోనీ సేన.. పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. మరోవైపు ఆర్సీబీ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. కోహ్లి నాయకత్వంలోని బెంగళూరు ఐదు మ్యాచ్‌లు ఆడి రెండింట్లో గెలుపొందింది. ఇరు జట్లూ చివరి మ్యాచ్‌ల్లో ఓడాయి. కోల్‌కతాపై పది పరుగుల తేడాతో చెన్నై అనూహ్యంగా ఓడగా.. ఢిల్లీ చేతిలో కోహ్లి సేన 59 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. ఇరు జట్లూ ఛేజింగ్‌లోనే చతికిలపడ్డాయి.
కోల్‌కతాపై సత్తా చాటిన ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్ రాణించాలని చెన్నై కోరుకుంటోంది. మిడిల్ ఆర్డర్ వైఫల్యం చెన్నైను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ధోనీ, జాదవ్ హిట్టింగ్ చేయలేకపోతున్నారు. కాగా డ్వేన్ బ్రావో జట్టులో చేరడంతో చెన్నై సూపర్ కింగ్స్ సమతూకంతో ఉంది.
మరోవైపు బెంగళూరు జట్టులో పడిక్కల్, కోహ్లి, డివిలియర్స్ కీలకం కానున్నారు. గాయం నుంచి కోలుకున్న క్రిస్ మోరిస్.. ఈ సీజన్లో తొలిసారి బరిలో దిగనున్నాడు. మోరిస్ ఆడితే.. మొయిన్ అలీకి తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు. శ్రీలంక బౌలర్ ఇసురు ఉడానా బదులు ఆడమ్ జంపానను ఆడించే అవకాశం ఉంది. లేదంటే సిరాజ్ స్థానంలో గురుకీరత్ సింగ్ ఆడే ఛాన్స్ ఉంది.
బెంగళూరుపై ధోనీ 793 రన్స్ చేయగా... చెన్నైపై కోహ్లి 747 రన్స్ చేశాడు. ఈ సీజన్లో పవర్ ప్లేలో 16 ఓవర్లు బౌలింగ్ చేసిన దీపక్ చాహర్ కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కానీ చెన్నై పేసర్లు డెత్ ఓవర్లలో 16 వికెట్లు తీశారు.
చెన్నై జట్టు (అంచనా): షేన్ వాట్సన్, డుప్లెసిస్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ, సామ్ కరన్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, శార్దుల్ థాకూర్, కర్ణ్ శర్మ.
బెంగళూరు జట్టు (అంచనా): ఆరోన్ ఫించ్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, క్రిస్ మోరిస్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఉడానా/జంపా, గురుకీరత్ సింగ్/సిరాజ్, నవదీప్ సైనీ, యుజువేంద్ర చాహల్.
Post a Comment