Home
/
Movies
/
HBD Rajamouli: ఆకాశమే హద్దుగా రాజమౌళి ప్రయాణం.. తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటుతూ విజయాల పరంపర
HBD Rajamouli: ఆకాశమే హద్దుగా రాజమౌళి ప్రయాణం.. తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటుతూ విజయాల పరంపర
రాజమౌళి తొలి అడుగు:
రాజమౌళి పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. సినిమా రంగానికి రాకముందు పలు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. ఆ తర్వాత తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ మార్చేస్తూ 2001 సంవత్సరంలో స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తన జర్నీ స్టార్ట్ చేసిన రాజమౌళి.. అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా ఎదిగారు. ప్రస్తుతం దర్శక ధీరుడిగా కీర్తించబడుతున్నారు.
12 సినిమాలు.. దేనికవే ప్రత్యేకం:
తెరపై నవరసాలను సమపాళ్లలో రంగరించి చూపించగల సమర్దుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి.. ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం విశేషం. ఇప్పటికి ఆయన మొత్తం 12 సినిమాలు రూపొందించారు. అందులో సింహాద్రి, ఈగ, ఛత్రపతి, మగధీర, బాహుబలి దేనికవే ప్రత్యేకంగా నిలుస్తూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించాయి.
ఆ ఘనత రాజమౌళిదే:
ఇకపోతే బాహుబలి లాంటి భారీ సినిమాతో తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత కూడా రాజమౌళిదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దాదాపు ఐదేళ్లపాటు ఈ సినిమా కోసం కష్టపడిన జక్కన్న.. ఆశించిన దానికి మించి ఫలితం రాబట్టారు. బాహుబలి (ది బిగినింగ్), బాహుబలి (ది కంక్లూజన్) సినిమాలు రికార్డులన్నీ తిరగరాశాయి.
జాతీయ పురస్కారాలు:
ఉత్తమ తెలుగు చిత్రంగా ఈగ సినిమా జాతీయ పురస్కారం అందుకుంది. మగధీర చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డుతో పాటు దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ సొంతం చేసుకున్నారు రాజమౌళి. చిత్ర రంగానికి ఆయన చేస్తున్న సేవలకు గాను పద్మ శ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. హీరోయిజాన్ని పవర్‌ఫుల్‌గా ఎలివేట్ చేయడంలో దిట్ట అని నిరూపించున్న ఆయన మరిన్ని భారీ సినిమాలు తీసి తెలుగు సినిమా ఖ్యాతిని మరింత విస్తృతం చేయాలనే దిశగా అడుగులేస్తున్నారు.
RRR:
ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న భారీ సినిమా RRR. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా డీవీవీ దానయ్య సమర్పణలో 400 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్‌ని తనదైన స్టైల్‌లో ప్రెజెంట్ చేయనున్నారు రాజమౌళి.
Post a Comment