Hero Glamour Blaze: హీరో నుంచి గ్లామర్ సిరీస్ లో మరో బైక్.. అదిరే లుక్.. అద్భుత ఫీచర్లు
హీరో మోటోకార్ప్ మరో బైక్ తో మార్కెట్లో సందడి చేయనుంది. ఈ సంస్థ నుంచి వచ్చిన బైక్‌లలో విజయవంతమైన మోడల్‌గా పేరు తెచ్చుకున్న గ్లామర్ సిరీస్‌లో మరో వేరియంట్‌ను పరిచయం చేసింది. గ్లామర్ బ్లేజ్ పేరుతో వస్తోన్న ఈ సరికొత్త ఎడిషన్‌ను హీరో సంస్థ తాజాగా ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ షోరూమ్‌లలో గ్లామర్ బ్లేజ్ లభిస్తుందని సంస్థ ప్రకటించింది. దీని ధర రూ.72,200(ఎక్స్-షోరూమ్ దిల్లీ). కొత్త మోటారుసైకిల్ హ్యాండిల్‌బార్‌కు యూఎస్‌బీ ఛార్జర్ ఆప్షన్ ఉంది. దీంతోపాటు కొత్త మాట్ వెర్నియర్ గ్రే కలర్‌లో ఈ బైక్ లభిస్తుంది.
బ్రాండ్ విలువను పెంచేలా ఉన్న బ్లేజ్
దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న గ్లామర్ మోడల్ బైక్‌లు సంస్థ బ్రాండ్ విలువను, పనితీరును సూచిస్తాయని హీరో మోటోకార్ప్ సేల్స్ అండ్ ఆఫ్టర్‌సేల్స్ హెడ్ నవీన్ చౌహాన్ చెబుతున్నారు. ఇటీవల విడుదల చేసిన కొత్త గ్లామర్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన తెలిపారు. ఇప్పుడు అదే సిరీస్‌లో వస్తోన్న బ్లేజ్ ఎడిషన్ దేశంలోని యువతను ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.
యువతను ఆకట్టుకుంటుంది
పండుగ సీజన్ కంటే ముందే తమ సంస్థ నుంచి ఇలాంటి ఉత్తమ ఉత్పత్తులు రావడం మంచి విషయమని హీరో మోటోకార్ప్ స్ట్రాటజీ హెడ్ మాలో లే మాసన్ చెబుతున్నారు. కొత్త ఉత్పత్తుల బలమైన శ్రేణి హీరో సంస్థకు ఉందని ఆయన చెప్పారు. కొత్త గ్లామర్ బ్లేజ్ హై-ఆన్-ఎనర్జీ ఎడిషన్ ను యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించామన్నారు.
సరికొత్త సాంకేతికత
గ్లామర్ బ్లేజ్ బైక్ 125 సిసి బిఎస్-6 ఇంజిన్‌తో లభిస్తుంది. ఎక్స్‌సెన్స్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో ఇది పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 7500 RPM వద్ద 10.7 bhp, 6000 RPM వద్ద 10.6 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఆటో సెయిల్ టెక్నాలజీతో పాటు హీరో ఐ 3 ఎస్(ఐడియల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్) సాంకేతికత ఈ బైక్ సొంతం.
కంఫర్ట్ రైడింగ్ అనుభూతి
రైడింగ్ కంఫర్ట్ కోసం ఈ బైక్‌లో అదనపు ఫీచర్లు ఉన్నాయి. దీని హ్యాండిల్ వద్ద యుఎస్‌బీ ఛార్జింగ్ సదుపాయం ఉంది. సైడ్-స్టాండ్ కు ఇండికేటర్ ఇచ్చారు. 240 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, 180 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ తో నమ్మకమైన, ఉత్తమ రైడింగ్ సౌకర్యాన్ని ఈ మోడల్ బైక్ అందిస్తుందని హీరో సంస్థ ప్రకటించింది.
Post a Comment