Nuvve Kavali @ 20 years: 20 వసంతాల ‘నువ్వే కావాలి’.. ఒక్క సినిమా ఎన్నో విశేషాలు..
Nuvve Kavali @ 20 years: 18 ఏళ్ల కుర్రాడు హీరో.. 19 ఏళ్ల అమ్మాయి హీరోయిన్.. ఇద్దరూ కొత్తవాళ్లే. అప్పటికే ఇండస్ట్రీలో స్టార్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేకుండా.. పూర్తిగా అప్ కమింగ్ టీంతో ఓ సినిమా వచ్చింది.
సరిగ్గా 20 ఏళ్ల కింద అక్టోబర్ 13న తెలుగు ఇండస్ట్రీలో ఓ అద్భుతం జరిగింది.. దాని పేరు నువ్వే కావాలి. అప్పటి కుర్రాళ్లకు పిచ్చెక్కించిన సినిమా ఇది.. ఈ సినిమాతో హీరోగా పరిచయమైన 18 ఏళ్ల కుర్రాడు తరుణ్. అప్పటికే తెలుగులో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నేషనల్ అవార్డు కూడా సంపాదించాడు.
కొన్నేళ్ల పాటు చదువుతో బిజీగా ఉండి 2000 ఏడాది నువ్వే కావాలి సినిమాతో మెయిన్ హీరోగా వచ్చాడు. వచ్చీ రావడంతోనే చాలా మంది అమ్మాయిలకు కొన్నేళ్ల పాటు నిద్ర లేకుండా చేసాడు తరుణ్. ఇక రిచా కూడా అంతే. అబ్బాయిలు ఈ అమ్మాయి లాంటి గాళ్ ఫ్రెండ్ ఉంటే బాగున్ను.. స్నేహితురాలు ఉంటే బాగున్ను అని కలలు కన్నారు.
నువ్వే కావాలి తెలుగు సినిమాపై వేసిన ముద్ర అలాంటిది మరి. కోటి స్వరపరిచిన 'అనగనగా ఆకాశం ఉంది..' పాట కొన్నేళ్ల పాటు ఊపేసింది. అప్పట్లో నువ్వే కావాలి పాటలు ఓ సంచలనం.. ఆరు నుంచి 60 వరకు ఈ పాటలకు ఫిదా అయిపోయారు. మిలీనియం సంవత్సరంలో బాక్సాఫీస్ దగ్గర చరిత్రను తిరగరాసింది నువ్వే కావాలి.
ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేకుండా ఇండస్ట్రీ హిట్ సాధించిన సినిమా ఇది. కేవలం కథాబలంతోనే నువ్వే కావాలి అంతటి సంచలనం రేపింది. తరుణ్-రిచా జంటగా కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబరు 13, 2000 నాడు విడుదలైంది. నేటికి ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో అన్ని రికార్డులను తిరగరాసింది.
మలయాళంలో కమల్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ 'నీరమ్' నుంచి నువ్వే కావాలి కథ పుట్టింది. ఈ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన నిర్మాత సవ్రంతి రవికిషోర్ తెలుగులోనూ ఆ కథా నేపథ్యంతో సినిమా తీయాలనుకున్నారు. అయితే అప్పటికి ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో ఉషాకిరణ్ మూవీస్‌తో కలిపి ఈ సినిమాను నిర్మించాడు ఈయన.
మలయాళ వాసనలున్న కథను త్రివిక్రమ్ పూర్తిగా తెలుగు నేటివిటీకి మార్చేసాడు. అప్పటికే 20-30 సినిమాల్లో బాలనటుడిగా చేసిన తరుణ్... ఆ తర్వాత సినిమాలు చేయాలని అనుకోలేదు. కానీ ఇంటర్ చదివేటప్పుడు రాజీవ్ మేనన్ ప్రకటనలో అతనితో పాటు రిచా కూడా సరదాగా నటించింది.
ఆ జోడీని చూసి 'నువ్వే కావాలి'కి వీళ్లను ఎంపిక చేసింది చిత్ర బృందం. 'మనసు మమత' ద్వారా బాల నటుడిగా తరుణ్ వెండితెరకు పరిచయం చేసిన ఉషాకిరణ్ మూవీస్.. ఆ తర్వాత ఆయన్ని హీరోగా కూడా వాళ్లే పరిచయం చేసారు. ఇక సునీల్ ఈ చిత్రంతోనే తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు.
ఈ సినిమాలోని కళ్లలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, ఎక్కడ ఉన్నా, అనగనగా ఆకాశం ఉందితో పాటు అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్. 'నువ్వే కావాలి' సినిమా చాలా తక్కువ ప్రింట్స్‌తో విడుదలైంది. కేవలం 22 ప్రింట్లతో విడుదలైన ఈ చిత్రానికి మౌత్ టాక్ బాగా హెల్ప్ అయింది. దాంతో కొన్ని వారాల్లోనే 22 నుంచి 110 ప్రింట్స్‌కు చేరుకుంది.
సినిమా 100వ రోజున హైదరాబాద్ ఓడియన్ థియేటర్ కాంప్లెక్స్‌లోని 3 థియేటర్లలోనూ 4 షోలు ప్రదర్శించారు. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని హిందీలో ఉషాకిరణ్ మూవీస్ 'తుజే మేరీ కసమ్' పేరుతో రితేష్ దేశ్‌ముఖ్-జెనీలియా జంటగా నిర్మించింది.
ఈ సినిమా సమయంలోనే వాళ్లిద్దరూ ప్రేమలో పడి పదేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర నువ్వే కావాలి దాదాపు 24 కోట్లకు పైగా వసూలు చేసింది. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ కూడా ఈ సినిమా తిరగరాసింది. అవార్డుల పరంగా కూడా 'నువ్వే కావాలి' ముందుంది.
ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా జాతీయ అవార్డును తీసుకొచ్చింది. ఉత్తమ చిత్రం పురస్కారంతో పాటు, ఉత్తమ దర్శకుడిగా విజయ్ భాస్కర్, ఉత్తమ నటుడిగా తరుణ్, ఉత్తమ నటిగా రిచా, ఉత్తమ నేపథ్య గాయకుడిగా శ్రీరామ్ ప్రభుకి ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులు వచ్చాయి. నువ్వే కావాలి 20 ఏళ్ల పండగను తన కుటుంబంతో పాటు జరుపుకున్నాడు తరుణ్.
Post a Comment