Header Ads

రోజుకో కొత్త మలుపు తిరుగుతోన్న మహారాజా కళాశాలల ప్రైవేటీకరణ

 

రోజుకో కొత్త మలుపు తిరుగుతోన్న మహారాజా కళాశాలల ప్రైవేటీకరణ


విజయనగరం మహారాజా కళాశాలల ప్రైవేటీకరణ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ప్రైవేటీకరణ చేసే దిశగా మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌ సంచయిత అడుగులు వేస్తున్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన కాలేజీని ప్రైవేటీకరించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఎంఆర్ కాలేజీ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది ? అది ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చిందనేది చూస్తే ఉత్తరాంధ్రలో ప్రజలకు మంచి విద్యను అందించేందుకు పూసపాటి గజపతి రాజులు ఏర్పాటు చేసిన సంస్థ మహారాజా కళాశాల.

విజయనగరం మహారాజు పూసపాటి విజయరామ గజపతి దీన్ని స్థాపించారు. మాధ్యమిక పాఠశాలగా 1857లో ప్రారంభించారు. 1868 నాటికి ఉన్నత పాఠశాలగా మారింది. 1879లో కళాశాల స్థాయికి ఎదిగింది. గ్రాడ్యుయేషన్ తరగతులు 1881 నుంచి పూసపాటి ఆనంద గజపతి రాజు నేతృత్వంలో ప్రారంభించారు.1958లో రాజా సాహెబ్ పి.వి.జి.రాజు  మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఏర్పాటు చేశారు. మహారాజా కాలేజీని మాన్సాస్ పరిధిలోకి తీసుకోచ్చారు. 1987లో ఈ కళాశాలకు స్వయంప్రతిపత్తి వచ్చింది.

ఎంఆర్‌ కాలేజీకి అంతటి పురాతనమైన ప్రఖ్యాతి ఉంది. అలాంటి కాలేజీని ప్రైవేటీకరించేందుకు మాన్సాస్ ట్రస్ట్ పావులు కదుపుతోంది. ఈ మేరకు మాన్సాస్ యాజమాన్యం ఇచ్చిన అభ్యర్థనను పరిశీలించాలని ఉన్నత విద్య ఆర్జేడీని ఆదేశిస్తూ రాష్ట్ర్ర ఉన్నత విద్యా మండలి ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ లేఖ రాశారు. ఎయిడెడ్ కాలేజీ నుంచి అన్ ఎయిడెడ్ కాలేజీగా మార్చాలంటూ ప్రభుత్వానికి నివేదించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్దులు, ప్రజాసంఘాలు. ప్రస్తుతం మహారాజ కళాశాలు అటానమస్ పేరుతో ఎయిడెడ్ కాలేజీగా నడుస్తోంది. సుమారు నాలుగు వేల మందికి పైగా విద్యార్దులు కాలేజీలో విద్యనభ్యసిస్తున్నారు. దాదాపు యాభై మందికి పైగా అధ్యాపకులు మరో వంద మంది నాన్ టీచింగ్ స్టాప్ పనిచేస్తున్నారు. తాజా ట్రస్టు ప్రతిపాదనలతో వీరందరిలో టెన్షన్ మొదలైంది.

ఎంఆర్‌ కాలేజ్‌ ప్రైవేటీకరణపై కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు ఘాటుగానే స్పందించారు. మాన్సాస్ ట్రస్టును విచ్చిన్నం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. కాలేజీని ప్రైవేటీకరణ ఎందుకు చేయాలనుకుంటున్నారో  చైర్‌పర్సన్ సంచయిత చెప్పాలన్నారు అశోక్‌ గజపతి రాజు. బాబాయ్ అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలపై అదే రేంజ్‌లో స్పందించారు సంచయిత గజపతిరాజు. ఎంఆర్ కాలేజీపై అశోక్ గజపతిరాజు చేస్తున్నది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారామె. మహారాజా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హైస్కూల్ ఎయిడెడ్ హోదాను 2017లో ఆయనే సరెండర్ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ పాలసీతొనే ముందుకెళ్తున్నామంటూ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. అశోక్ గజపతి రాజు వల్ల మాన్సాస్ ట్రస్టు కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు సంచయిత.

ఐతే...విజయనగరం మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లోకి ప్రభుత్వాన్ని లాగటం భావ్యం కాదన్నారు మంత్రి బొత్స  సత్యనారాయణ. దీన్ని అశోక్ గజపతిరాజు, సంచయిత గజపతి రాజుల కుటుంబ వ్యవహారంగా కొట్టిపారేశారు.  ఈ సమస్యను వారే చక్కదిద్దుకోవాలన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇక ఆనంద గజపతి రాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళా గజపతి రాజు మహా రాజా కళాశాల వివాదంలోకి అడుగు పెట్టారు. ఎమ్ఆర్ కాలేజ్‌ను అన్ఎయిడెడ్ కాలేజ్‌గా మార్చాలనుకోవడం బాధాకరంగా ఉందన్నారు. ఈ కాలేజీలో చదువుకున్న వారంతా దేశ విదేశాల్లో రాణిస్తున్నారని గుర్తు చేశారామె. కాలేజీ ప్రైవేటీకరణను తాము ఎట్టి పరిస్థితిల్లోనూ ఒప్పుకోబోమని తెలిపారు. మాన్సాస్ ట్రస్టు చైర్‌పర్సన్ సంచయిత నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు ఊర్మిళ.    మొత్తానికి మహారాజా కాలాశాలల ప్రైవేటీకరణ వివాదం పూసపాటి వంశస్థుల మధ్య ఆగ్గిరాజేస్తోంది. 

No comments

Powered by Blogger.