బిట్టూ.. సుజాతను ఏకిపారేస్తున్న నెటిజన్లు
ఈ సీజన్‌లోని అందరు కంటెస్టెంట్లు వ్యాఖ్యాత నాగార్జున అక్కినేనిని సర్ అనే పిలుస్తారు. కానీ ఒక్కరు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. ఈ పాటికే అర్థమైపోయుంటుంది ఆ మనిషి ఎవరా అని! అవును, సుజాత ఒక్కరే నాగ్‌ను సర్ అని పిలవకుండా బిట్టు అని ముద్దుగా పిలుచుకుంటుంది. అలాగే ప్రతీ విషయానికి నవ్వుతూనే ఉంటుంది. ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థం కాదని నాగ్ చాలాసార్లు అన్నారు. ఆయనకే కాదు బిగ్‌బాస్ వీక్షకులకు కూడా ఆమె నవ్వు వెనక ఆంతర్యమేంటో అంతు పట్టదు.
స్టార్ హీరోను బిట్టు అని పిలవడమేంటి?
పొరపాటున నీ నవ్వు భలే ఉంటుంది అని నాగ్ అన్న పాపానికి చీటికిమాటికీ నవ్వుతూనే ఉంది. అయితే కొన్నిసార్లు ఆమె నవ్వు రాకపోయినా కావాలనే నవ్వుతుందని నెటిజన్లు సోషల్ మీడియాలో సుజాతను ట్రోల్ చేస్తున్నారు. సుజాతవి ఫేక్ నవ్వులని విమర్శిస్తున్నారు. వారాంతం వచ్చిందంటే చాలు, ఆమె నవ్వు చూడలేకపోతున్నామని ఘొల్లుమంటున్నారు. అలాగే వయసులోనే కాదు, అనుభవంలోనూ పెద్దవారైన స్టార్ హీరో నాగార్జునను పట్టుకుని గౌరవం లేకుండా బిట్టు అని పిలవడమేంటని నిలదీస్తున్నారు. అలా పిలవకూడదని ఆమెకెవరైనా చెప్పండ్రా అని ఉసూరుమంటున్నారు. నాగ్‌ను బిట్టు అని పిలిచిన ప్రతిసారీ చాలా చిరాకుగా ఉంటోందని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సుజాతను బయటకు పంపించేందుకు వెయిటింగ్
అయినా ఈ మధ్య సుజాత చాలా అతి చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొన్నామధ్య కెమెరా ముందు అప్పుడే ఏడుస్తూ, అప్పుడే నవ్వుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది. ఫ్యాషన్ షో అయిపోయాక అవినాష్ అద్దం టాస్క్‌లో అందరిపై కామెడీ చేస్తే నవ్వింది, కానీ ఆమెపై జోకులు పేలిస్తే మాత్రం సీరియస్‌గా తీసుకుంది. ఆ మధ్య అభిజిత్ చెల్లి అన్నందుకు కూడా తెగ ఫీలైపోయింది. ఎవరితో సరిగా కలవట్లేదన్న కారణంతో కుమార్ సాయిని నామినేట్ చేసి తిరిగి ఓ టాస్క్‌లో తన అవసరం కోసం మళ్లీ అతడి దగ్గరకే వెళ్లి సాయం కోరడం విడ్డూరం. వీటన్నింటినీ గమనిస్తున్న ప్రేక్షకులు ఆమె నామినేషన్ జోన్‌లోకి వచ్చే సమయం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి నామినేట్ అయితే చాలు, ఇంటి నుంచి బయటకు పంపించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై వేస్తున్న సెటైర్లపై మీరూ ఓ లుక్కేయండి.
Post a Comment