వాట్సాప్ లీక్: కంగనా - హృతిక్ సంబంధంపై అర్ణబ్ కామెంట్స్..! | WhatsApp Leak Arnab comments on Kangana Hrithik relationship
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసు ఊహించని మలుపు తిరుగుతోంది. ముంబై పోలీసులు ఈ కేసును విచారిస్తుండగానే... రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి మరియు ఇప్పటికే అరెస్ట్ అయిన బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తా సహా పలువురి మధ్య జరిగినవిగా భావిస్తున్న వాట్సాప్ చాట్ లు బయటపడ్డాయి. దాదాపు 500 పేజీలకు పైగా ఉన్న ఈ వాట్సాప్ మెసేజ్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటి ద్వారా వీరి మధ్య రక్షణ రహస్యాలు సహా అనేక మంది గురించి కీలక సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్స్ కంగన రనౌత్ - హృతిక్ రోషన్ వివాదం గురించి.. ప్రధాని కార్యాలయంతో అర్ణబ్ కు ఉన్న సంబంధాల గురించి వాట్సాప్ చాటింగ్ వివరాలు ఉండటం గమనార్హం.
ఈ వాట్సాప్ చాట్ లో కంగనా రనౌత్ కు ఎరోటోమానియా ఉందని.. హృతిక్ రోషన్ తో సంబంధం ఉందని అర్నాబ్ ఆరోపించినట్లు తెలుస్తోంది. కాగా టీఆర్పీ రేటింగుల కోసం అర్ణబ్ - దాస్ గుప్తాల మధ్య ఒప్పందం జరిగిందని ఆరోపణల్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా లీకైన వాట్సాప్ చాటింగ్ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. లీకైన సంభాషణల్లో ఓ కేంద్రమంత్రిని ఉద్దేశించి దాస్ గుప్తా 'యూజ్ లెస్' అని సంబోధించడం.. 'మంత్రులంతా మనతోనే ఉన్నారు' అని అర్నబ్ గోస్వామి మరో మెసేజ్ లో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చాట్ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)తో ఉన్న యాక్సిస్ ను అర్నబ్ గోస్వామి దుర్వినియోగం చేశాడనేందుకు బలం చేకూరిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Post a Comment