ఉపాధ్యాయుడికి ఓ లేఖ
‘తల్లి జన్మనిస్తుంది.. గురువు జీవితాన్నిస్తాడు’.. ఈ మాటలుఅక్షర సత్యాలు. ఎంతోమంది విద్యార్థుల జీవితాలు తరగతిగదిలోనే రూపుదిద్దుకుంటాయి. మరి తల్లి ఒడిని వీడి తరగతి గదికి చేరిన ఆ విద్యార్థికి గురువు ఎలాంటి విద్యాబుద్ధులు నేర్పించాలి? ఆ వ్యక్తి నడవడిక ఎలా ఉండాలి? అంటే అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ తన కొడుకుని ఎలా తీర్చిదిద్దాలో వివరిస్తూ ఓ ఉపాధ్యాయుడికి లేఖ రాశాడు.. ఆ లేఖ సారాంశం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీకోసం..
అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ తన కుమారునికి పాఠాలు చెప్పే ఓ ఉపాధ్యాయుడికి లేఖ రాశాడు. ఈ సమాజంలోని మంచి-చెడులను, గెలుపు-ఓటములను, సుఖ-దుఃఖాలను, సమస్త విషయాలను వివరించండి. ఈ సమాజానికి ఉపయోగపడే ఒక పౌరునిగా తన కుమారుణ్ని తీర్చిదిద్దాలంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు.
‘‘ ఈ రోజు నుంచి నా కుమారుడి విద్యాభ్యాసం మొదలవుతుంది. కొద్దికాలం వాడికి అక్కడి పరిస్థితులు కొత్తగా, వింతగా అనిపిస్తాయి. వాడిని సౌమ్యంగా చూస్తారని భావిస్తున్నాను. ఈరోజు వాడికి సాహసం వంటిది. చరిత్రలోని సాహాసాలన్నీ కూడా వేదననే మిగిల్చాయి. కానీ ఓ మంచి వ్యక్తిగా జీవించడానికి విశ్వాసం, ప్రేమ, ధైర్యం అవసరం’’.
‘‘ప్రియమైన ఉపాధ్యాయులారా నా కుమారుణ్ని మీ చేతులలోకి తీసుకోండి. అన్ని విషయాల్ని అర్థమయ్యేలా సున్నితంగా వాడికి నేర్పించండి. ప్రపంచంలో అందరూ నీతిమంతులు, నిజాయితీపరులు ఉండరని, కానీ నీచులతో పాటు ఉత్తములు, స్వార్థ రాజకీయనాయకులతో పాటు నిబద్దత గల నాయకులు, శత్రువులతో పాటు మిత్రులు కూడా ఉంటారని వాడికి తెలియపరచండి’’.
‘‘ఒకరిపై ఆధారపడి బతకడం కన్నా తన కాళ్లపై తాను నిలబడటం గౌరవమని బోధించండి. దొరికిన 100 రూపాయల కన్నా, సంపాదించిన రూపాయి విలువ ఎక్కువని, మోసం చేసి గెలవడం కన్నా ఓటమే మంచిదని నేర్పండి. ఒకరిపై అసూయ, ద్వేషం పెంచుకోవడం మంచిది కాదని చెప్పండి. సౌమ్యస్వభావులతో సున్నితంగా, మొండి వాళ్లతో మొండిగా ఎలా ఉండాలో ఓర్పుగా నేర్పించండి. నిశ్శబ్దపు నవ్వులో ఉండే రహస్యాన్ని వివరించండి.
విషాదంలో నవ్వడం నేర్పండి. ఓటమిలోని విజయాన్ని ఆస్వాదించడం నేర్పండి. కన్నీరు కార్చటాన్ని సిగ్గుగా భావించవద్దని తెలపండి.’’.
‘‘తన సొంత ఆలోచనల్ని అందరూ తప్పంటున్న సరే వాటిపై నమ్మకాన్ని కలిగి ఉండేలా, అందరూ ఒకే మందలో చేరి గుడ్డిగా వెళుతున్నప్పుడు, సొంతంగా ఆలోచించి నిర్ణయించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉండేలా చెప్పండి. ఎవరు చెప్పినా శ్రద్ధగా వినడాన్ని, వాటిలోని మంచి విషయాల్ని గ్రహించి ఆచరించటాన్ని నేర్పించండి.𝑆𝑎𝑡𝑦𝑎
‘తన మేధస్సును అత్యధిక ధరకు అమ్ముకోనేలా నేర్పండి. కానీ వాడి హృదయంపైన, ఆత్మపైన అమ్మకపు ధర అతికించుకోవద్దని బోధించండి. తన వద్ద ఉన్నది నలుగురికి పంచటాన్ని, ప్రకృతిని ఆస్వాదించటాన్ని నేర్పండి. పుస్తకాలు చేసే అద్భుతాలని వివరించండి. అన్నింటిని సున్నితంగా చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో గారాబం చేయవద్దు. తప్పు చేయటానికి భయపడే స్వభావాన్ని, కష్టాల్లో ధైర్యంగా నిలబడే సహనాన్ని బోధించండి. తనపై తనకు అపారమైన ఆత్మవిశ్వాసం పెరిగేలా చేయండి’.
‘‘నా కుమారుడు ఇలా ఉండాలని నా కోరిక. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. నా ప్రయత్నం నేను చేస్తాను’’ అని ముగించాడు.
అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
Post a Comment